ఫీలయ్యారా?

20, మే 2009, బుధవారం

దేశం నాగలికి పని చెప్పలేదు, విత్తనాల నాణ్యత చూడలేదు

కానీ నెల రోజుల తర్వాత మొలకలు చూడాలని ఆశించింది! అడపా దడపా ఉద్యమాలు మినహా పార్టీని పరిపుష్టం చేయడానికి క్షేత్ర స్థాయిలో కసరత్తు నాలుగేళ్ళు శూన్యం. విత్తనాలు చూడబోతే పాతబడి నాసి రకంగా మారాయి. వాటికి నీరు పోసి, పదును లేని భూమిలో విత్తి, అనువైన వాతావరణం కోసం ప్రార్ధించి, నెలరోజుల తర్వాత ఫలితం చూడలనుకున్నారు పెద్దలు.

నేల సరి లేక పోయినా, విత్తనం వేసే ముందు నీళ్ళలో వేస్తే దాని పసేమిటో తెలిసిపోయేది. 2004 లో బొటాబొటీ మెజారిటీ వచ్చిన విత్తనాలు ఎప్పుడు చూసినా పార్టీ కార్యాలయాన్ని అంటి పెట్టుకుని ఉండేవి. లోలోపల ఉడికి పోయి పస లేకుండా తయారయిన వీటిని మొలకల కోసం వాడలనుకోవడం ఎంత అవివేకం. "నేల సంగతి సరే, విత్తనమయితే మన కళ్ళముందే నిగ నిగ లాడుతూ వుంది... కొద్దో గొప్పో వాతావరణం కూడా అనుకూలంగానే వుంది కదా" అనుకున్నారు.

ఇంకేం, 16వ తేదీన మొలకలన్నిటినీ జనాలకి చూపించి మెప్పిద్దామానుకున్నారు. కానీ ఈ స్పెషల్ గ్రేడ్ విత్తనాలు, సాధారణ వ్యవసాయక పరిస్థితుల్లో మొలకేత్తలేవు. వాటికి అసాధారణ అనుకూలత అవసరం. బోటనీ, థియరీ, రిపోర్టులు మొదలైన వాటిని వదలి, మన చేతిలో లేని వాతావరణ పరిస్థితుల కోసం ప్రార్థించే కన్నా, మన నేల సరి చేసుకుని, విత్తనాల్ని పరీక్షించుకోవడం తెలివైన పనేమో!

*చూసి రమ్మంటే కాల్చి వచ్చే కొడాలి నాని లాంటి యువ నేతల్ని వదిలి, కాల్చి రమ్మంటే చూట్టనికే వేరే వాళ్ళని పంపి, తర్వాత వాకబు చేసే సో కాల్డ్ సీనియర్ లీడర్లతో ఎంత వరకు ప్రయోజనం?

పైనా, కిందా, అటుపక్క, ఇటుపక్క... ఈ రచ్చంతా కాంగ్రెస్ పుణ్యమే

ఈ దేశం వాళ్ళ బాబు గాడి సొమ్ము అన్నట్టు ప్రత్యేక దేశాలు ఉదారంగా కట్టబెడతారు. ముష్టి అందుకున్న వాళ్ల తోటే మనకి తలనొప్పి తెచ్చి పెడతారు. తాతల నుంచి మనవళ్ళ దాక ఈ వంశ పారంపర్య పాలనలో మన దేశానికి అన్ని పక్కల నుంచి ముప్పు వుండేలా వ్యవస్థని తీర్చి దిద్దారు కాంగ్రెస్ నాయకులు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, శ్రీలంక, సియాచిన్ వగైరా మూకలన్నీ వీళ్ళ పుణ్యమే. శాంతి అనేది వీళ్ళ డిక్షనరీ లోనే లేదు. అశాంతి కి ఆజ్యం పోస్తారు. ఏదో ఒక రోజు దానికే బలవుతారు. దాన్ని అణిచే ప్రయత్నంలో మళ్ళీ అల్లర్లని చవి చూస్తారు.

అధిక సంఖ్యలో వున్నతమిళుల పక్షాన పోరాడుతున్న LTTE పైకి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపి శ్రీలంక ప్రభుత్వానికి మద్ధతు నిచ్చారు రాజీవ్ గాంధీ. ఒక పక్క చర్చలు జరుపుతూనే, రా పాత్ర వుండగానే, ఈ దారి ఎందుకు ఎంచుకున్నారనేది ఎవరికీ అర్ధం కాలేదు. పీస్ కీపింగ్ ఫోర్స్ ఆగడాలకు బలయిన వారి వివరాలను ప్రచురించింది LTTE. ఆ ఫోర్స్ లో తోటి తమిళుల పై పోరుకు సిద్ధమైన తమిళ సైనికుల బాధ వర్ణనాతీతం. ఇంత జరిగినా బల ప్రయోగం చేయకుండానే శాంతి భద్రతలను నెలకొల్పిందన్నరాజీవ్ గాంధీ మాటలను వారు ఏ విధంగా అర్ధం చేసుకుని వుంటారో ఊహించవచ్చు.

తాతలు తెచ్చి పెట్టిన తలనొప్పులకు మందు రాసుకోలేని ఆ ప్రభుత్వం చివరికి ఆ యువ నాయకుడినే అసంతృప్తికి బలి ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికలయ్యేంతవరకు ప్రభాకరన్ మా మిత్రుడు... లాంటి మాటల్ని కరుణానిధి చే పలికించి, ఫలితాల సమయంలో పులి ని మట్టు బెట్టింది. LTTE ఒక జాతి అసంతృప్తి నుంచి పుట్టింది. దానికి పరిష్కారం రాజకీయంగానే వెతకాల్సింది. బలవంతపు దాడుల వల్ల నష్ట పోయేది మన దేశమే. మన నాయకుల చరిత్రాత్మక, వ్యూహత్మక తప్పిదాలకు నాయకుల తో పాటు, సామాన్య ప్రజలు కూడా బలవుతూనే వున్నారు.

19, మే 2009, మంగళవారం

ఎల్లలు దాటనున్న జలయజ్ఞం?

లోక్ సభ ఎన్నికల్లో విజయభేరి మ్రోగించి, పార్లమెంట్ లో తనదైన ముద్ర వేయనున్న వై యస్ ఆర్ ఇప్పుడు తన ప్రాజెక్టుల పర్వాన్ని దేశమంతా కొనసాగించనున్నారని భోగట్టా. అదే జరిగితే జల వనరుల పై ఆంధ్ర ప్రభుత్వానిది పై చేయి అవుతుంది. కేంద్ర మంత్రి వర్గంలో ఇరిగేషన్ శాఖని తన ముఖ్యుల్లో ఒకరికి ఇప్పించడం ద్వారా ఆయన ఈ ప్రణాళికను నిజం చేసుకోనున్నారని తెలిసింది. నదుల అనుసంధానం కూడా ఈ బృహత్ప్రణాళికలో భాగం కావచ్చు.

18, మే 2009, సోమవారం

నాయకులు తయారవుతారు, కథానాయకులు సృష్టించబడతారు!

ఈ లాజిక్ మన ప్రజలకు అర్ధమయింది కానీ పార్టీలకు ఇంకా అర్థంకావట్లేదు. ప్రజల కష్టనష్టాలు నాయకుల్ని ప్రేరేపిస్తాయి. వాటిని అదిగమించడానికి చేసే ప్రయత్నం నాయకుణ్ణి తయారుచేస్తుంది. కథానాయకులు రాత్రికి రాత్రి సృష్టించబడతారు. వారు జనంలో తిరగరు, జనంలోంచి పుట్టరు. చెత్త కథానాయక పాత్రల ఎంపికతో జనాలకి చుక్కలు చూపిస్తున్న మన హీరోలు ఏకంగా నాయకుల పాత్రలే పోషిస్తామంటూ జనాల్లోకి వచ్చారు. అడ్రస్ లేకుండా పోయారు. నాయకులు కావాలంటే రథాలు దిగి జనాల్లో కలవండి. జనంతో తిరగండి. కథానాయకుడికి నాయకుడికి మధ్య అంతరాన్ని చెడిపేసి, సాధారణ వ్యక్తిలా ఆలోచించి అసాధారణంగా ఎదిగిన ఎన్టీఆర్ ఫార్ములాలో ఈ చిన్న ఎలిమెంట్ ని మన తొడలు కొట్టే, మీసాలు తిప్పే హీరోలు మిస్ అవుతున్నారు.

తెదేపా తెలంగాణా నాయకులకే ఈ ఓటమి అంకితం!

దేవేందర్ గౌడ్ బాబు పై తెచ్చిన ఒత్తిడి, తదనంతర పరిణామాలు పార్టీ పుట్టి ముంచాయి. మేము మా ప్రజలకు, కేసీఆర్ కు దీటయిన సమాధానం ప్రత్యేక తెలంగాణా పై ఇవ్వాలని, దాని పై తెదేపా వైఖరి స్పష్టం చేయకుండా ఎన్నికలకు వెళ్ళలేమని కోరి కేసీఆర్ తో తల గోక్కున్నారు. వాదన లేవనెత్తిన గౌడ్, పెద్దిరెడ్డి, కడియం, ఎర్రబెల్లి తదితరులు చంద్రబాబుని స్థిమితంగా ఉండనివ్వలేదు. తెలంగాణ తమ్ముళ్ళ అసమ్మతి తలనొప్పి భరించడం ఎందుకని కూటమిని ఆవిష్కరించారు బాబు గారు. అక్కడ ఆంధ్రా సెంటిమెంట్ బాగా పని చేసి, మిత్రుణ్ణి (తెరాసని) చూసి తెదేపాకి వాత పెట్టారు కోస్తా వోటర్లు.

కొసమెరుపేమిటంటే ఎర్రబెల్లి మినహా వైఖరి స్పష్టం చేయాలని మంకు పట్టు పట్టిన నేతలు అపజయం పాలయ్యారు. బాబు తనుచేయలనుకున్నది తాను చేసినంతకాలం అంతా సవ్యంగా నడిచింది. ఇకనైనా ఇంటిపెద్దని తనే అని గుర్తించి మసలు కోవడం మేలు, లేక పొతే పార్టీ అధ్యక్ష పదివికి తమ్ముళ్లే ఎసరు పెట్టగలరు!

16, ఏప్రిల్ 2009, గురువారం

ప్రచారంలో మొనగాళ్ళు!

ప్రచారం ముగిసింది. ఎన్నిక మొదలయింది. ఇప్పుడు ఎస్.ఎం.ఎస్. కూడా వాడడానికి వీల్లేదని కమీషన్ ఆంక్షలు విధించింది. ఏదేమయినా, ఇప్పటి వరకు తెలుగునాట వివిధ మాధ్యమాల ద్వారా జరిగిన ప్రచారంలో ఎవరు ఎక్కువ ప్రజల దృష్టిని ఆకర్షించారు అనేది చూద్దాం.

వార్తా పత్రికలు: తెలుగుదేశం (మానిఫెస్టో ముఖ్యాంశాలు...సూటిగా, సుత్తి లేకుండా), భాజపా (ప్రభుత్వాలని పోల్చి చూపిన విధానం)
రేడియో: కాంగ్రెస్ (జయహో!), లోక్ సత్తా (మూడు కుటుంబాల్ని కాదు, రాష్ట్రాన్ని గెలిపించుకోండి)
ఇంటర్నెట్: భాజపా (వివిధ వెబ్ సైట్లలో లాల్ క్రిష్ణ అద్వాని బ్యానర్స్)
టి. వి. : ప్రజారాజ్యం ("ప్రజారాజ్యం - ఇది ప్రజల రాజ్యం" స్టాలిన్ చిత్ర గీతానికి అనుకరణ అయిన ఉత్తేజభరితంగా ఉంది. ఈ స్థాయి లో ప్రోమోషనల్ విడియో క్లిప్ వేరే పార్టీ అందించలేక పోయింది)
ఎస్. ఎం. ఎస్.: కాంగ్రెస్, తెదేపా
హోర్డింగ్ / OOH: లోక్ సత్తా (AP Needs JP), ప్రజాస్వామ్యం అనే క్షతగాత్రుడిని అంబులెన్స్ లో మోసుకొని వెళ్ళడం
Road show: YSR, NTR, Pawan Kalyan

* వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు, హాస్యాస్పదమయిన చేష్ఠలను మినహాయించడమయినది.

14, ఏప్రిల్ 2009, మంగళవారం

ఎన్నికల కలకలం: ఈ రోజు పెళ్ళికి పెద్ద దిక్కు... తర్వాత?

కొన్ని వర్గాల, సమాజాల అభిమతమే మతమై కూర్చుంటుంది. హిందూ మతానికి ప్రేరణగా ఉంటూ వచ్చిన అంశం "సత్యం". సత్యాన్వేషణలో తమ అనుభవాల సారాన్ని ఇతిహాసాలుగా, ఫలితాల్ని వేదాలుగా మన పూర్వికులు మనకందించారు. అలాగే ఇస్లాంకి "ప్రేమ", క్రిస్తయానిటికి "కరుణ" కీలకాంశాలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చెప్పుకున్న మతాల వారు వారికి ప్రాతిపదికగా నిలిచిన సున్నితమైన మూలాల్ని ఎలా పూడ్చిపెడుతున్నారో చూస్తూనేవున్నాం!


ఆ పరంపరలోనే ఏర్పడిన కొత్త పునాది నమ్మకం. మనం ఈ కర్మ భూమి పై మనుగడ సాగించాలంటే ఈ నమ్మకమనే దాన్ని మనసా వాచా కర్మణా నమ్మి తీరాలి. ప్రపంచంలో నేపాల్ మాత్రమే హిందూ దేశంగా పరిగణించబడుతుంది. పేరుకే హిందూస్తాన్ అయినా మన "లౌకిక " సిద్ధాంతం ప్రకారం మనదో అయోమయ రాజ్యం. ఈ రాజ్యంలో అఫిషియల్, అనఫిషియల్ వ్యవహారాలన్నీ నమ్మకమనే కొత్త ప్రాతిపదికన నడుస్తున్నాయి. "సత్యాన్ని" వదిలేసి "నమ్మకాన్ని" పట్టుకొని వేళ్ళాడే మరో తంతు "పెళ్లి".


ఇప్పుడు ఈ ఎలెక్షన్ పెళ్లిని సాధ్యమైనంతవరకు సజావుగా , శాస్త్రయుక్తంగా (రాజ్యంగబద్ధంగా) జరిపించటానికి, ఎన్నికల కమీషన్, పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాలు, సహకార సంఘాలు, మీడియా సంస్థలు ఇప్పుడు పురోహితులు, పెద్దలు వగైరా ప్రముఖ పాత్రల్ని పోషిస్తున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలు - వాగ్దానాలు, ఎజెండాలు, వోట్లు మొదలైనవి వర్తమానానికి సాక్ష్యులు మాత్రమే! కాపురానికి (భవిష్యత్తుకి) మాత్రం ఎలాంటి హామీ లేదా భరోసా ఇవ్వలేవు. వోటు హక్కు వినియోగించుకోండి అని వోటు వేయనివాడో వింత పశువు అన్న స్థాయిలో ఊదరగొడుతున్నారు. పెళ్లి చేసుకోవడం కూడా ఒక హక్కేనా? పెళ్లి కాస్తా లొల్లి అయితే చెప్పుకునే దిక్కులేనపుడు, ఇప్పుడు పెళ్లిపెద్దల పాత్ర పోషిస్తున్న వారు ప్రేక్షకులుగా మిగిలిపోతున్నపుడు స్వయంవరానికి అర్థమేముంది?


ప్రతివాడూ తాతల కాలం నాటి రాజ్యాంగాన్ని మార్చాలనే అంటాడు. కానీ మార్చరు. ఎందుకంటే ఇవాళ పెళ్లి చేసుకున్నవాడే రేపు పని చేయాలి!