ఫీలయ్యారా?

14, ఏప్రిల్ 2009, మంగళవారం

ఎన్నికల కలకలం: ఈ రోజు పెళ్ళికి పెద్ద దిక్కు... తర్వాత?

కొన్ని వర్గాల, సమాజాల అభిమతమే మతమై కూర్చుంటుంది. హిందూ మతానికి ప్రేరణగా ఉంటూ వచ్చిన అంశం "సత్యం". సత్యాన్వేషణలో తమ అనుభవాల సారాన్ని ఇతిహాసాలుగా, ఫలితాల్ని వేదాలుగా మన పూర్వికులు మనకందించారు. అలాగే ఇస్లాంకి "ప్రేమ", క్రిస్తయానిటికి "కరుణ" కీలకాంశాలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చెప్పుకున్న మతాల వారు వారికి ప్రాతిపదికగా నిలిచిన సున్నితమైన మూలాల్ని ఎలా పూడ్చిపెడుతున్నారో చూస్తూనేవున్నాం!


ఆ పరంపరలోనే ఏర్పడిన కొత్త పునాది నమ్మకం. మనం ఈ కర్మ భూమి పై మనుగడ సాగించాలంటే ఈ నమ్మకమనే దాన్ని మనసా వాచా కర్మణా నమ్మి తీరాలి. ప్రపంచంలో నేపాల్ మాత్రమే హిందూ దేశంగా పరిగణించబడుతుంది. పేరుకే హిందూస్తాన్ అయినా మన "లౌకిక " సిద్ధాంతం ప్రకారం మనదో అయోమయ రాజ్యం. ఈ రాజ్యంలో అఫిషియల్, అనఫిషియల్ వ్యవహారాలన్నీ నమ్మకమనే కొత్త ప్రాతిపదికన నడుస్తున్నాయి. "సత్యాన్ని" వదిలేసి "నమ్మకాన్ని" పట్టుకొని వేళ్ళాడే మరో తంతు "పెళ్లి".


ఇప్పుడు ఈ ఎలెక్షన్ పెళ్లిని సాధ్యమైనంతవరకు సజావుగా , శాస్త్రయుక్తంగా (రాజ్యంగబద్ధంగా) జరిపించటానికి, ఎన్నికల కమీషన్, పోలీసు యంత్రాంగం, న్యాయస్థానాలు, సహకార సంఘాలు, మీడియా సంస్థలు ఇప్పుడు పురోహితులు, పెద్దలు వగైరా ప్రముఖ పాత్రల్ని పోషిస్తున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలు - వాగ్దానాలు, ఎజెండాలు, వోట్లు మొదలైనవి వర్తమానానికి సాక్ష్యులు మాత్రమే! కాపురానికి (భవిష్యత్తుకి) మాత్రం ఎలాంటి హామీ లేదా భరోసా ఇవ్వలేవు. వోటు హక్కు వినియోగించుకోండి అని వోటు వేయనివాడో వింత పశువు అన్న స్థాయిలో ఊదరగొడుతున్నారు. పెళ్లి చేసుకోవడం కూడా ఒక హక్కేనా? పెళ్లి కాస్తా లొల్లి అయితే చెప్పుకునే దిక్కులేనపుడు, ఇప్పుడు పెళ్లిపెద్దల పాత్ర పోషిస్తున్న వారు ప్రేక్షకులుగా మిగిలిపోతున్నపుడు స్వయంవరానికి అర్థమేముంది?


ప్రతివాడూ తాతల కాలం నాటి రాజ్యాంగాన్ని మార్చాలనే అంటాడు. కానీ మార్చరు. ఎందుకంటే ఇవాళ పెళ్లి చేసుకున్నవాడే రేపు పని చేయాలి!

కామెంట్‌లు లేవు: