ఫీలయ్యారా?

20, మార్చి 2009, శుక్రవారం

పార్టీ ఏదయినా, నాయకుడెవరైనా తప్పని "తారక" మంత్రం

ఒకటీ అరా పార్టీలు తప్ప అన్ని ప్రముఖ పార్టీలు, అధికారులు, సామాన్య ప్రజానీకం ఒక వ్యక్తిని మాత్రం ఈ ఎన్నికల సందర్భంగా బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఆయనే దివంగత ముఖ్యమంత్రి, తెలుగునాట సంచలనం నందమూరి తారక రామారావు. పలు రంగాల్లో ఆయన వేసిన ముద్ర అలాంటిది మరి.

రెండు రూపాయలకి కిలో బియ్యం ఇప్పుడు కాంగ్రెస్ వారి పాచిక అయ్యింది. ఇక ప్రజారాజ్యం ఆయన్ని తరచు గుర్తు చేసుకుంటోంది. రామారావు తీసుకు వచ్చిన రాజకీయ ఒరవడిని తామూ ఇప్పుడు సృష్టించగలమని, ఆయన మాదిరిగా అన్ని వర్గాలకి ఆధిపత్యాన్నీకట్టబెట్టి, డిల్లీ పెత్తనాన్ని సవాలు చేయగలమని వారంటున్నారు. ఇక దేశం వారు వేషధారణతో సహా ఆయన్ని అనుకరిస్తున్నారు. ఇక రెబల్స్ సంగతి చెప్పక్కర్లేదు.

ప్రజలతో మమేకమయి, తమ ప్రాంతం వారికి ఒక అస్థిత్వాన్ని చేకూరిస్తే ఏ నాయకుణ్ణయినా అలాగే గుర్తుపెట్టుకుంటారు.

ఇంతకీ నిశ్శబ్ద విప్లవం ఎవరిది?

ఈ మధ్య ఓ మితృడన్నాడు... ఫుల్ సౌండ్ తో, వాద ప్రతివాదనల తో వేదికల పై గోల చేస్తున్న ప్రరాపాది నిశ్శబ్ద విప్లవం ఎలా అవుతుంది? ఆ పదం లోక్ సత్తా కి సరిపోతుందేమో అని. కొత్త నియోజకవర్గం కూకట్ పల్లిలో అతని విజయం ఖరారయినట్టే. అక్కడ విద్యావంతులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కాస్త ఎక్కువ. ముఖ్యం గా ప్రాంతీయాభిమానం, కులాభిమానం మరీ ఎక్కువ.

ఇక ఆయన ప్రచార శైలి చూస్తే ఒబామాని అనుకరించినట్టే ఉంది. పిల్లల భవిష్యత్తుకు హామీ, మార్పు వగైరా అంశాల నుంచి, వీడియో క్లిప్పుల్లో బ్యాక్ డ్రాప్, రైలు ప్రయాణం వంటివి బాగానే అనుకరించబడుతున్నాయి. గతంలో ఆయన సాధించిన స్కోరు చూస్తే నిశ్శబ్ద విప్లవం అనే మాట లోక్ సత్తాకి సరిపోతుందేమో!

షబ్బీర్ అలీని చూసి నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు!

ఇంట ఓడి రచ్చ గెలిచిన నాయకులేందరో ఉన్నారు. ప్రజల మనుషుల కుటుంబాల్లో సంబంధాలు అంతకంతకూ అంతరించి పోయి ఏదో ఒక విషయంలో గొడవలు సహజమయిపోతాయి...ఇంటాయన పరిణతితో అవే సర్దుకుంటాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసి వీధిన పడ్డ షబ్బీర్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఎలా ఎదుర్కోవాలో తెలీక "బాబూ ముందు మీ అమ్మకు న్యాయం చేసుకో " అని ఓ ఉచిత సలహా పారేస్తున్నారు.

తానేమి మాట్లాడుతున్నాడో, చేస్తున్నాడో స్పష్టత కలిగి ఉండి పార్టీలకు చెమటలు పట్టిస్తున్న యువకుడికి తన తల్లికి ఎలా న్యాయం చేసుకోవాలో ఎవరైనా చెప్పాలా?