ఫీలయ్యారా?

18, మే 2009, సోమవారం

తెదేపా తెలంగాణా నాయకులకే ఈ ఓటమి అంకితం!

దేవేందర్ గౌడ్ బాబు పై తెచ్చిన ఒత్తిడి, తదనంతర పరిణామాలు పార్టీ పుట్టి ముంచాయి. మేము మా ప్రజలకు, కేసీఆర్ కు దీటయిన సమాధానం ప్రత్యేక తెలంగాణా పై ఇవ్వాలని, దాని పై తెదేపా వైఖరి స్పష్టం చేయకుండా ఎన్నికలకు వెళ్ళలేమని కోరి కేసీఆర్ తో తల గోక్కున్నారు. వాదన లేవనెత్తిన గౌడ్, పెద్దిరెడ్డి, కడియం, ఎర్రబెల్లి తదితరులు చంద్రబాబుని స్థిమితంగా ఉండనివ్వలేదు. తెలంగాణ తమ్ముళ్ళ అసమ్మతి తలనొప్పి భరించడం ఎందుకని కూటమిని ఆవిష్కరించారు బాబు గారు. అక్కడ ఆంధ్రా సెంటిమెంట్ బాగా పని చేసి, మిత్రుణ్ణి (తెరాసని) చూసి తెదేపాకి వాత పెట్టారు కోస్తా వోటర్లు.

కొసమెరుపేమిటంటే ఎర్రబెల్లి మినహా వైఖరి స్పష్టం చేయాలని మంకు పట్టు పట్టిన నేతలు అపజయం పాలయ్యారు. బాబు తనుచేయలనుకున్నది తాను చేసినంతకాలం అంతా సవ్యంగా నడిచింది. ఇకనైనా ఇంటిపెద్దని తనే అని గుర్తించి మసలు కోవడం మేలు, లేక పొతే పార్టీ అధ్యక్ష పదివికి తమ్ముళ్లే ఎసరు పెట్టగలరు!

2 కామెంట్‌లు:

Pratap చెప్పారు...

కాంగ్రెస్ లో కూడా తెలంగాణా వాదానికి స్పష్టంగా మద్దతు పలికి న మధు యాష్కి వంటి వారు గెలిస్తే గోడ మీది పిల్లి వాటం లా వ్యవహరించిన చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి , డి శ్రీనివాస్ , సురేష్ రెడ్డి , రత్నాకర్ రావు వంటి హేమా హేమీలు మట్టి గరిచారు కదా ? దీని కే మంటారు.?

చంద్రబాబు 2004 లో స్పష్టంగా సమైక్య వాదం పై ఎన్నికలకు వెళ్లి నప్పుడు ఎవరు వోట్లేశారు ?

వై ఎస్ గాని కాంగ్రెస్స్ పార్టీ గాని సమైక్య వాదమే మా విధానమని అప్పుడు చంద్రబాబు లా స్పష్టంగా ప్రకటించిందా?

అంతా దొంగ నాటకాలే కదా?!
అన్ని పార్టీలు తెలంగాణాకు అనుకూలమే అంటూ నాటకాలు ఆడలేదూ ??
ఇకనైనా తెలంగాణా ప్రజలను వారి ఆకాక్షలను అవహేళన చేయడం మానండి.
చేతనైతే నేరుగా తెలంగాణా ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు ప్లెబిసైట్ నిర్వహించండి !
సమస్య తేలిపోతుంది.

viswamitra చెప్పారు...

ప్రతాప్ గారు, మీ విశ్లేషణకు ధన్యవాదములు.

ఒకఅవసరం కోసం తెదేపా తన 2004 నాటి సిద్ధాంతాన్నిపక్కన బెట్టి, ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా వ్యవహరించింది. ఇప్పుడు, అంటే ఎన్నికల తంతు ముగిశాక కూడా ఆ పార్టీ తెరాస తో కలిసి వుంటే ఈ అనుకూలత శాస్వతమనుకొవచ్చు. కానీ పరిస్థితి అలా లేదు.

ఒక అజెండాతో పార్టీ పని చేయాలి కాని, పార్టీ మనుగడ కోసం ఒక అజెండాను సృష్టించుకుంటే ఇలాగే వుంటుందని చెప్పడమే ముఖ్యోద్దేశ్యం. ఈ పని కాంగ్రెస్ చేస్తే ప్రజలు క్షమిస్తారు. వారి పోకడ అంతేలే అని వదిలేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ తో ఆ పని జరగ పొతే బాధ్యతవహించడానికి మొయిలీ, సోనియా... ఇలా ఎన్నో పేర్లుంటాయి. ఎల్లయ్య కాక పొతే మల్లయ్య, ఆయనా కాక పొతే పుల్లయ్య మీద తోసేసి సమయం గడిపేస్తారు. కానీ తెదేపాలో అలా కాదు.

దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కాంగ్రెస్ కి తెలంగాణాలో వచ్చిన సీట్లు. వై యస్ ఆర్ ఉండగా ప్రత్యేక తెలంగాణ రాదని తెలిసీ ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ కి ఆధిక్యతని కట్టబెట్టారు. మీరు చెప్పిన హేమా హేమీలు ఇలా ద్వంద్వవైఖరితో పరాజయం పాలయ్యారు. తెలంగాణకి సుముఖంగానో, విముఖతతోనో ఉంటే ఏదో ఒక ప్రాంతపు వోటు ఖచ్చితమనుకోవచ్చు.

ఒక పార్టీ విశ్వసనీయత గల సంస్థతో కలిసి ప్లేబిసైటు నిర్వహించి, తీర్పుని గౌరవించి తెలంగాణా మరియు తెలంగాణేతర ప్రాంతాల్లో తమ అభ్యర్థులని నిలబెడితే అఖండ మెజారిటి వచ్చేది. తాత్కాలిక సర్దుబాట్లు, నాన్చుడు ధోరణి వల్ల ఎవరికీ ఎక్కడ మెజారిటీ రాకుండా పోయింది. కాంగ్రెస్ గెలిచినా, మీరు నిశితంగా గమనిస్తే యన్టీ కాంగ్రెస్ వోట్లే అధికంగా వున్నాయి.