ఫీలయ్యారా?

10, జనవరి 2009, శనివారం

పదేళ్ళ క్రితం జరగాల్సిన పరిణయం!

మళ్ళీ కృష్ణవంశి మూవీ వచ్చింది... శశిరేఖ పరిణయం. టైటిల్ చూసి చెప్పొచ్చు, మరో బంధుమిత్రుల హంగామా అని. చిత్రం చూసి చెప్పొచ్చు ఇది 2009 లో రావాల్సినది కాదని. నిన్నే పెళ్ళాడుతా, అనగనగా ఒక రోజు వంటి చిత్రాలు వచ్చిన 90ల నాటి కథ, కథనంతో మరో హిట్ కొట్టకపోతానా అని విడుదల చేసేసాడు.

అనుకోకుండా జరిగే సంఘటనలతో పెళ్లికి ముందే హీరో, హీరోయిన్లు ఎలా దగ్గరవుతారు, పెళ్లితంతు కూడా వాళ్ళకి తెలియకుండానే యాదృచ్చికంగా ఎలా ముగుస్తుందనేది ఒకటికి రెండు సార్లు చూపిస్తాడు. సీతారాముల కళ్యాణం పాటతో మొదలయిన సినిమా తరుణ్, జెనీలియాల పెళ్లి సీన్ తో ముగుస్తుంది. మధ్యలో అంతా ఉరుకులు, పరుగులు, అపార్థాలు, అలకలు, ప్రమాదాలు, ఈ గొడవలో అంతర్లీనంగా హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లికి తగ్గట్టుగా వారు ఎలా ఒకటయ్యారు అనేది కృష్ణవంశి చెప్పాలనుకున్న విషయం. కానీ అదేంటో, ఏ సన్నివేశం చూసినా ఇంతకుముందు ఏదో సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది.

ఉన్న ఒక్క మెలోడీని బట్టల షాప్ లో (విజయవాడ-మాన్య) తీసి మమః అనిపించాడు. ఆ దుకాణం వాళ్ల ఫోటోషూట్, వీరి పాట చిత్రీకరణ ఒకేసారి జరిగినట్టుంది (ఇప్పుడు టీవీల్లో వచ్చే యాడ్స్ చూస్తే తేలుస్తుంది). మొత్తానికి ఈ టింగిరి, బుచ్చమ్మల (సినిమాలో హీరో, హీరోయిన్ల ముద్దు పేర్లు) పెళ్లి ఎప్పుడో అవ్వాల్సిందని అనిపిస్తుంది.

కామెంట్‌లు లేవు: