ఫీలయ్యారా?

17, జనవరి 2009, శనివారం

తెలుగుని బతికించే మాధ్యమానికి మాయరోగం!

అరువు సన్నివేశాలు, పొంతనలేని పాటలు, విషయంలేని కథనంతో నూటికొక్క సక్సెస్ తో ఉసూరుమంటున్న మన సినిమా ఒకందుకు గర్వపడాలి. ఈరోజుల్లో ఎవ్వరికీ పట్టని తెలుగుని ఏదో ఒక రకంగా బతికిస్తున్నందుకు. దాని చుట్టూనే FMలు, టీవీలు, మన పండుగలు, పబ్బాలు పరిభ్రమిస్తున్నాయి. రోజంతా కాన్వెంట్లోనూ, తల్లితండ్రుల ఫ్యాషన్ ఇంగ్లీషుతో, కాకుంటే కాలేజీలో, MNCల్లో ఆంగ్లం మాట్లాడుతూ తరించే పిల్లా, పెద్దా సినీ కార్యక్రమాలు, సినిమాలూ చూసి కాసేపు తెలుగుతో పరచయం పెంచుకుంటారు. వచ్చీ రాని తెలుగు మాట్లాడే హీరోయిన్లు, కొన్ని శాల్తీలు మినహాయింపులెండి!


ఇప్పుడా సినిమాకి యాసలు, మాండలికాల గొడవొచ్చిపడింది. అందరికీ అర్థం కావాలన్న ఉద్దేశ్యంతో ముద్రణ, సినిమాల్లో ప్రామాణికంగా ఒక తెలుగు నుడికారాన్ని గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నాం. అయితే తెలంగాణ యాసని కమేడియన్స్కి, విలన్స్కి తెలుగు సినిమాలల్లో ఎక్కువగా వాడుతున్నారని ఒక వాదం. దానికి తోడు, స్థానిక వృత్తుల్ని కూడా ఆపాదిస్తున్నారు. ఉదాహరణకి తెలంగాణా యాదవుల్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయని నంది అవార్డుల సందర్భంగా కొందరు ఓ సినిమాలో ఝాన్సీ పోషించిన పాత్రని ఎంపిక చేయడాన్ని నిరసించారు. హీరోలకి మాత్రం నేటివిటీ తో పని లేకుండా, కథతో సంబంధం లేకుండా ప్రామాణిక తెలుగుని వాడడాన్ని తప్పు పడుతున్నారు.
ఇది ఆలోచించాల్సిన విషయమే. అయితే కథ అన్నాక కథానాయకులుంటారు. వారి మాటలు ఎందరినో ప్రభావితం చేస్తాయి. ఇతర చిన్నా చితకా పాత్రలతో పోలిస్తే వారి మాటలు రాయలసీమ, కోనసీమ, శ్రీకాకుళం తదితర ప్రేక్షకులందరికీ అర్థం కావాలి. కథల్లో పాత్రలకి వేర్వేరు వ్రుత్తులుంటాయి. వారి భాష వారి వ్యవహారాన్ని ప్రతిబింబిస్తుంటుంది.

ముఠామేస్త్రి సినిమాలో పరుచూరికిచ్చిన యాదవ్ పాత్ర వినోదాత్మకంగా ఉండడమేకాక ఆ వృత్తికి వన్నె తెచ్చేదిగా వుంటుంది. సముద్రం సినిమాలో తనికెళ్ళ పోషించిన విశాఖ ప్రాంతానికి చెందిన బెస్తవాడయిన విలన్ పాత్ర కూడా అంతే.
వారి పాత్ర ఔచిత్యాన్ని, సందర్భాన్ని బట్టి సహజత్వం కోసం మాండలికాన్ని ఉపయోగించడంలో తప్పు లేదు. కాని కించ పరిచే విధంగా, ఒక ప్రాంతం వారిని తక్కువచేసేలా చూపించడం గర్హించదగినదే.


మాండలికాల పై ఎక్కువ దృష్టి పెట్టి ప్రతిదీ వివాదాస్పదం చేస్తే ఇక కళాకారులకు స్వేచ్చ వుండదు. పత్రికలూ, స్కూలు పుస్తాకాలు, ప్రభుత్వ సమాచారం వారి వారి మాండలికంలో ముద్రించబడాలనే కొత్త వాదం పుట్టుకొస్తుంది.


మూలిగే నక్కపై తాటి పండు అన్నట్టు అసలు తెలుగు ఉనికికే ప్రమాదమొచ్చి పడిందిరా అంటే ఆ తెలుగు, ఈ తెలుగు అంటూ కొట్టుకోవడం ఎంతవరకు సబబు?

కామెంట్‌లు లేవు: