వెండితెరపై అద్భుతం, ప్రపంచ స్థాయి సినిమాలు తీయగలమని మనవాళ్ళూ నిరూపించారు వగైరా మాటలు అరుంధతి సినిమా చూసిన చాల మందే అన్నారు. అయితే ఆ కామెంట్ చిత్రం గురించి కాదు అందులో వాడిన గ్రాఫిక్స్ గురించి. నిజమేననుకుని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో అరుంధతిని చూద్దామని ఓ సెలవు రోజు సాయంత్రం బయలుదేరాను.
గొప్ప ప్రమాణాలు అని ముద్దుగా పిలుచుకునేదేది ఆ స్థాయిలో ఉండదని, పై పై హంగులకి మోసపోతామని ఇంతకుముందు ఎన్నో సార్లు అవగతమయింది. కాక పొతే ఆ సాయంత్రం 70 mm పై కనపడింది ... థియేటర్ లోకి వెళ్ళక ముందునుంచే.
అక్కడ సిబ్బందికి ఒంటి మీద యునిఫార్మ్ అయితే ఉంది గాని బుర్రలో ఏముందో, అదే స్థాయిలో తెలివి తేటలున్న ఆ మేనేజిమెంట్ కి, మల్టిప్లెక్స్ ని డిజయిన్ చేసిన వారికే తెలియాలి. ఇప్పటికి పది సార్లు వెళ్ళినా, ఆ రోజు మాత్రం వారి సామర్ధ్యాన్ని "దగ్గర" నుంచి చూసే భాగ్యం కలిగింది.
ఒక షో వదలక ముందే తరువాతి షోకి వచ్చిన వారిని వారి వాహనాల పార్కింగ్ కోసం లోపలికి పంపారు. కిక్కిరిసిపోయిన ఓ మైదానం లాంటి పార్కింగ్ లాట్ మధ్యలో ఉన్న దార్లో అరగంట ఇరుక్కుపోయాను. వెనక్కి వద్దామంటే మన లాంటి వాళ్ళు ఓ ఇరవై కార్లలో గేటు దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. స్ట్రీట్ ఆఫ్ నో రిటర్న్ సినిమా అక్కడే చూపించేసారు. బుక్ మై షో వాడు నాకు ఇంకో షో చూపించాడు. టికెట్ కోసం నా ఫోనే లో ఉన్న మెసేజ్ చూపించాను. Gold M1 అని ఉన్న టికెట్ చూసుకొని లోపలికి వెళ్ళాను. అది సరిగ్గా తెర ముందే వుంది, అదీ పూర్తిగా ఎడమవైపున.
పై నుంచి కింద వరకు ఒకే టికెట్, కాని సౌకర్యంలో మాత్రం కొండంత వ్యత్యాసం. మొట్ట మొదటి సారిగా ఆ వరుసలో వెళ్లి పడ్డాను. వీక్షించడంలో ఒక మంచి అనుభూతి కోసమే అలాంటి చోటికి వెళ్తాము. అందరికీ ఒకే టికెట్ అయినపుడు కింద వాళ్ళకి రిక్లైండ్ సీట్లు ఇవ్వడమో లేదా మరో ఆలోచనో అది డిజైన్ చేసిన వాడికి లేదు. తెర మీద పాత్రలు ఎటు కదులుతుంటే అటు తల, కళ్లు తిప్పుతూ చూడాల్సిందే. అదే గోల్డ్ క్లాస్ మరి.
ఎలాంటి సౌండ్ సిస్టం అయినా మన సినిమా ఆపరేటర్లు యధావిధిగా వాళ్ల నుంచి ఓ స్పెషల్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం వాల్యూం పెంచి, తగ్గించి రీరికార్డింగ్ అందాన్ని చిత్రవధ చేసి గూబలదరగోట్టే అదనపు అనుభూతినిచ్చారు. గొప్పగా
చెప్పిన గ్రాఫిక్ కలలు మొదటి అయిదు నిమిషాల్లోనే పటాపంచలయ్యాయి. పాడుబడ్డ కోట మీకు నాటకాల్లో వెనుక కట్టిన తెర మీద బొమ్మలా అనిపిస్తుంది.
దర్శకుడు మాత్రం ఒక సంస్థానానికి (గద్వాల) చెందిన పరిసరాల్లోకి, వాతావరణంలోకి మనల్ని తీసుకు వెళ్ళడంలో కృతకృత్యులయ్యారు. కథ కూడా ఫరవాలేదు. అనుష్కకి వంక పెట్టాల్సిన పని లేదు. మహిళలంతా తమని తము జేజమ్మ (anushka sr) లో చూసుకుంటారనడంలో అతిశయోక్తి లేదు.
మాస్క్, గాడ్జిల, జురాసిక్ పార్క్, మమ్మీ తదితర చిత్రాలు చూసిన వారికి అరుంధతి లోఉన్న ఆనిమేషన్ ఏమిటనేది సులభంగానే అర్థమవుతుంది. వూళ్ళో కరువు, రోగాలు వచ్చిన సన్నివేశంలో కోటని అచ్చంగా ఒక తెర మీద వేసిన బొమ్మలానే చూపిస్తారు. ఇక దయ్యాలు, జుట్టు, గోళ్ళు పెరగడం, చెట్టు వేర్లు మనిషిని చుట్టుకోవడం వగైరాలు వడి వడి గా తిప్పేసారు, గ్రాఫిక్ పనితనం కనబడుతుందనో ఏమో. ఇక పతాక సన్నివేశంలో మీ ముందున్న అరుంధతి, పశుపతిని చంపుతుండగా పాత్రాభినయం, గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకదానికొకటి పోటీ పడుతూ దేని మీదా దృష్టి నిలపనివ్వకుండా పిచ్చేక్కిస్తాయి.
అయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , గ్రాఫిక్స్ తదితర ఎఫ్ఫెక్ట్లు ఉన్నాయో లేవో తెలియనంతగా అవి కథనంలో మమేకమయి పోవాలి గానీ అవికూడా ఫలాన విధంగా సీన్లో ఉన్నాయని మనకి అర్థమయి పోతుంటే ఇక వాటిని గొప్పగా వాడారని ఎలా చెప్పగలం? గొప్పగా చూపించారని మాత్రమె చెప్పగలం. సినిమా చూసేసిన వాళ్ళు చెప్పిందీ అదే. కాని మనమే వేరే రకంగా అర్థం చేసుకున్నాము. గ్రాఫిక్స్ ని సాధ్యమయింత భారీగానే వాడారు. అనుమానం లేదు. కథాంశం లేకుండా చూస్తె అత్యున్నత స్థాయిలోనే ఉండవచ్చు కూడా. కాని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కథని ఎలివేట్ చేస్తూ బలాన్ని చేకూర్చాయని చెప్పడం హాస్యాస్పదం.
గొప్పగా చెప్పుకునేవన్నీ గొప్పగా వుండవు - ప్రసాద్స్ లా. అందులోకి వెళితే, మనల్ని ఎలా మభ్యపెడుతున్నరనేది అర్థం చేసుకుంటే, వేరే వాటితో పోల్చిచూస్తే వాటి గొప్పతనమేమిటో తెలుస్తూంది. అది అరుంధతికి కూడా వర్తిస్తుంది.
1 కామెంట్:
మీరన్నట్లు అరుంధతిలో సిజిఐ ఎఫెక్ట్స్ ఓహో అనిపించే విధంగా లేవన్నది నిజమే. అయితే తెలుగు సినిమాల స్థాయికి అవి బాగానే ఉన్నాయి. హాలీవుడ్ సినిమాల స్థాయిలో తెరపై వింతలు పూయించటానికి మనవాళ్ల బడ్జెట్, మన సినిమాల మార్కెట్ పరిధి, ఇతర రిసోర్సెస్ సహకరించవు. అందుకే ఆ మాత్రం ఎఫెక్ట్స్ కూడా ఇతర సినిమాల్లో కనపడవు.
అరుంధతి అంత పెద్ద హిట్ అవటానికి స్పెషల్ ఎఫెక్ట్స్ మాత్రమే కారణం అని నేననుకోవటం లేదు. నిజం చెప్పాలంటే అరుంధతి గొప్ప సినిమా ఏమీ కాదు. కధ కూడా సాధారణమైనదే. మరి ఇంకేముంది అందులో?
నా వరకూ అరుంధతిలో నచ్చిన విషయాలు - అనూష్క నటన, సోనూ సూద్‌కి అరువిచ్చిన రవిశంకర్ గొంతు .. వీటన్నిటినీ మించినది - అనుకున్న కధకి అనవసరమైన కామెడీ ట్రాకులు, ప్రేమ పైత్యాలు, వెకిలి నృత్యాలు వగైరా మసాలాలు జోడించకుండా నిజాయితీగా సినిమా తీసిన నిర్మాత ధైర్యం. ఉన్న కధ కొంచెమే ఐనా అనవసర దృశ్యం అనేది లేకుండా రాసుకొచ్చిన స్క్రీన్-ప్లే. రెండున్నర గంటల పాటు విసుగు రాకుండా కూర్చోపెట్టిన విషయాలు ఇవే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి